Election Updates: బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌పై కేసు నమోదు

Election Updates: Case registered against BJP candidate Rajasingh
Election Updates: Case registered against BJP candidate Rajasingh

గోషామహల్ కాషాయ పార్టీ అభ్యర్థి,బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తారు. ఎప్పుడూ మతపరమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ పోలీసు కేసుల్లో ఇరుక్కుంటారు. తాజాగా ఆయనపై ఇదే విషయంలో మరోసారి కేసు నమోదైంది. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఆయనపై మంగళ్‌హాట్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ నెల 14వ తేదీన అఫ్జల్‌గంజ్‌ పరిధిలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచారంలో రాజా సింగ్ మతపరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలపై ఎస్సై షేక్ అస్లాం ఫిర్యాదు చేయడంతో రాజాసింగ్​పై సెక్షన్‌ 153, 153(ఏ) ఐపీసీ కింద కేసు నమోదు చేసినట్లు సీఐ రవి కుమార్ తెలిపారు.

ఇంతకీ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే.. ఇటీవల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజాసింగ్ తనకు శత్రువులు ఎక్కువగా ఉన్నారని అన్నారు. తీవ్రవాద శక్తులను ప్రోత్సహిస్తున్న పార్టీలను తరిమికొట్టాలని పేర్కొన్నారు. అంతే కాకుండా తనను ఓడించేందుకు ప్రపంచంలోని ముస్లిం ప్రముఖులంతా ప్రయత్నిస్తున్నారని.. అందుకోసం భారీగా నిధులు సమీకరిస్తున్నారని ఆరోపించారు.