ఒకవైపు రాష్ట్రంలో డొక్కు బస్సులతో ప్రజలు నరకయాతన పడుతుంటే మరోవైపు కొని తెచ్చిన కొత్త బస్సులను రోడ్డెక్కించాల్సిన ఆర్టీసీ అధికారులు.. సీఎంతో రిబ్బన్ కట్ చేయించడానికని వాటిని వర్క్‌షాప్‌లో వదిలేశారు. ఇటీవల ఆర్టీసీ కోసం ప్రభుత్వం 80 బస్సులు కొనుగోలు చేసింది. అధికారులు వాటిని విజయవాడలోని ఆర్టీసీ వర్క్‌షాపులో ఉంచారు. సీఎం జగన్ చేతులమీదుగా ప్రారంభింపజేయాలని నెల రోజులు ఎదురుచూశారు. అయినా.. సీఎం రాలేదు. ఇప్పుడేమో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
ప్రజాప్రతినిధులే ప్రారంభించాలని ఇప్పటికీ అధికారులు భావిస్తే.. ఎన్నికల హడావుడి పూర్తయ్యే వరకూ ఆగక తప్పదు. అప్పటి వరకూ కొత్త బస్సులను చూసి మురుస్తూ, డొక్కు బస్సులో ప్రయాణించక తప్పదు. ప్రస్తుతం కొత్త బస్సులను పాతవాటితో కలిపి వర్క్‌షాపులో నిలిపారు.