తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 55 మందితో తొలి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ జాబితా తర్వాత పెద్ద ఎత్తున అసంతృప్తి చెలరేగి.. పార్టీలో చీలక వస్తుందని భావించినా.. అలాంటిదేమీ జరగలేదు. కానీ పలుచోట్ల కొంత మంది మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. మరికొందరు మాత్రం పార్టీ అధికారంలోకి వచ్చాక తమకు లబ్ధి చేకూరుతుందని భావించి సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. అయితే రెండో జాబితాపై ఇప్పుడు హస్తం నేతలు ఫోకస్ పెడుతున్నారు.
తొలి విడత బస్సుయాత్ర తర్వాతనే రెండో జాబితా ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాదాపు 110 నియోజక వర్గాలకు స్క్రీనింగ్ కమిటీ కసరత్తు పూర్తి చేసినా వివాదం లేని సగం స్థానాలకు మాత్రమే అభ్యర్ధులను ప్రకటించింది. మిగిలిన 64 స్థానాల్లో 9 మినహా అన్నింటిపై కసరత్తు పూర్తైనట్లు సమాచారం. ఆ 9 చోట్ల వామపక్షాలతో పొత్తు, ఐదాగురుగురు పార్టీలో చేరేవారుండడంతో పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. 30 చోట్ల గట్టి పోటీఉండడంతో సంప్రదింపులు చేసే బాధ్యతని జానారెడ్డి నేతృత్వంలోని సమన్వయ కమిటీకి ఏఐసీసీ అప్పగించింది. ఈనెల 21వ తేదీ తర్వాత, ఎప్పుడైనా రెండో జాబితా వెలువడే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.