ఈసారి రాష్ట్రంలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు 20 సీట్లు మాత్రమే వస్తాయని సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో పర్యటించిన ఆయన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలకు భట్టి విక్రమార్కకు ఓటు వేస్తే నష్టమే అని కేసీఆర్ చెప్పారు. కమల్ రాజును గెలిపిస్తే, మధిర నియోజకవర్గంలోని దళితులందరికీ దళిత బంధు ఇస్తామని హామీ ఇచ్చారు.
“దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ తయారైంది. ప్రతి ఇంటికి మంచినీరు ఇచ్చే ఒకేఒక్క రాష్ట్రం తెలంగాణ. చిత్తశుద్ధితో పనిచేస్తేనే విజయాలు సాధ్యమవుతాయి. మధిరలో కాంగ్రెస్ తరపున గెలిచిన భట్టిపై ఎలాంటి వివక్ష లేదు. ఉత్తర భారతదేశంలో దళితులపై భయంకరమైన దాడులు జరుగుతున్నాయి. దళిత బంధులో రిజర్వేషన్లు పెట్టి వారికి ఇస్తున్నాం. పట్టిలేని భట్టి విక్రమార్కకు మళ్లీ ఓటు వేస్తే ఇక్కడి ప్రజలు ఏమీ రాదు. భట్టి విక్రమార్క నియోజకవర్గానికి ఆరు నెలలకు ఒక్కసారి వస్తారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏం చేసిందో ఆలోచించాలి. అభ్యర్థులతో పాటు వారి పార్టీల చరిత్రను చూడాలి. మీ ఓటు మీ భవిష్యత్తుతో పాటు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది.” అని కేసీఆర్ ప్రజలకు సూచించారు.