ఏపీ ప్రభుత్వం రక్తంలో మునిగి ఉందని.. దాని నుంచి బయటకు రావాలని మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత నర్రెడ్డి అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ‘వివేకం ’ సినిమాపై స్పందించారు.
‘‘డాక్యుమెంటరీ అనాలో.. సినిమా అనాలో తెలియడం లేదు. ఎవరో కానీ.. చాలా ధైర్యంగా తీశారు. అందులో కొన్ని వ్యక్తిగత అంశాల్లో తేడా ఉండొచ్చు. చివరి అరగంట నాకే భయమేసింది. ఆ సమయంలో కళ్లు మూసుకున్నా. రియాలిటీని తలచుకుంటే మాత్రం ‘వివేకం ’ సినిమాను చాలా లైట్‌గా తీశారు. రియాలిటీ ఇంకా ఘోరంగా ఉంది. గత ఎన్నికల్లో హత్యను రాజకీయాలకు వాడుకున్నారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు. నేనెప్పుడు రాజకీయాల్లో లేను. తప్పు జరుగుతోంది కాబట్టే బయటకి వచ్చి ఐదేళ్లుగా పోరాడుతున్నా . వైకాపా ప్రభుత్వం మళ్లీ వస్తే వ్యక్తిగతంగా నాతో పాటు ఈ రాష్ట్రానికీ మంచిది కాదు’’ అని సునీత వ్యాఖ్యానించారు.