Election Updates: విశాఖ బీచ్‌లో ప్రారంభించిన రోజే తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి

Election Updates: Floating bridge broke on Visakha Beach on the day it was inaugurated
Election Updates: Floating bridge broke on Visakha Beach on the day it was inaugurated

విశాఖ బీచ్‌లో ఎంతో ఘనంగా ప్రారంభించిన ఫ్లోటింగ్‌ బ్రిడ్జి ప్రారంభించిన ఒక్కరోజులోనే తెగిపోయింది. ఆదివారమే వైఎస్సార్సీపీ నేతలు ఈ బ్రిడ్జిని ప్రారంభించగా.. సోమవారం నుంచి సందర్శకులను అనుమతించాలని భావించారు. అయితే అంతలోనే అది కాస్తా రెండు ముక్కలైంది. ఆ సమయంలో పర్యాటకులు లేకపోవడంతో పెను విషాదం తప్పిపోయింది.

సముద్ర తీరం నుంచి లోపలికి వంద మీటర్ల పొడవున ఫ్లోటింగ్‌ డబ్బాలతో ఈ వంతెనను విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ఏర్పాటు చేయించింది. ‘టీ’ ఆకారంలో ఉన్న దాని మీద నడుచుకుంటూ వెళ్లి చివరన నిలబడి సముద్రాన్ని వీక్షించొచ్చు. ఇప్పుడు ఆ వీక్షించే భాగమే విడిపోయి, అనుసంధానంగా ఉన్న ప్రాంతం నుంచి అది తెగిపడి సుమారు మూడు వందల మీటర్ల దూరంలోకి వెళ్లిపోయింది. అలల తీవ్రతకు అనుసంధాన బోల్టులు విరిగిపోయాయి.

ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.1.60 కోట్లు ఖర్చు చేశారు. నిర్వాహకులు మూడేళ్ల పాటు ఏటా రూ.15 లక్షలు వీఎంఆర్‌డీఏకు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ఘటన తరువాత వీఎంఆర్‌డీఏ సంయుక్త కమిషనర్‌ రవీంద్ర క్షేత్రస్థాయిలో పరిశీలించారు.