‘ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పాల్గొన్న ప్రజాగళం బహిరంగ సభలో అడుగడుగునా పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. సభలో ఎక్కడా ప్రజలను నియంత్రించే ప్రయత్నం చేయలేదు. సభ జరుగుతున్న సమయంలోనే అనేక భద్రతా వైఫల్యాలు కనిపించాయి. పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై సమగ్ర విచారణ జరపాలి’ అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు.
ఈ మొత్తం వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ప్రధాని సభ కోసం జారీ చేసిన కీలక పాస్‌లు ఎవరి పేరుతో జారీ చేశారన్న వివరాలు కూడా లేవు. ప్రధాని సభలో ఏ పేరు లేని పాస్‌లపై అధికారులు సంతకాలు చేసి ఇచ్చేశారంటే భద్రతా వ్యవహారాలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు . పోలీసుశాఖ, కలెక్టర్ కార్యాలయ అధికార యంత్రాంగం తప్పిదం ఇందులో కనిపిస్తోంది’ అని విమర్శించారు.