Election Updates:: ఆధారాలు ఉన్నా అవినాష్ ను జగన్ కాపాడుతున్నారు: YS షర్మిల

Election Updates:: Jagan is protecting Avinash despite evidence: YS Sharmila
Election Updates:: Jagan is protecting Avinash despite evidence: YS Sharmila

వైఎస్ రాజశేఖర్రెడ్డికి సీఎం జగన్ వారసుడే కాదని ఏపీ PCC చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. బస్సు యాత్రలో భాగంగా వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారిమఠంలో ఆమె మాట్లాడారు. వైఎస్ పాలనతో జగన్ పాలనకు పొంతనే లేదన్నారు. భూతద్దం పెట్టి చూసినా ఆ ఆనవాళ్లు కనిపించవని చెప్పారు. మాజీ మంత్రి వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్రెడ్డి నిందితుడని సీబీఐ చెప్పిందని.. కాల్ రికార్డులు, గూగుల్ మ్యాప్స్, లావాదేవీలు ఉన్నట్లు పేర్కొందని గుర్తుచేశారు. అన్ని ఆధారాలు ఉన్నా అతడిని జగన్ కాపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హంతకులకు ఓటు వేయొద్దు..

‘‘వైకాపా పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ధరల స్థిరీకరణ అని చెప్పి జగన్ మోసం చేశారు. YSR హయాంలో రైతు రారాజు.. ఇప్పుడు అప్పులేని రైతే లేడు. పంట నష్టం జరిగితే రూపాయి కూడా పరిహారం రావడం లేదు. డ్రిప్ వేసుకోవడానికీ అవకాశం లేకుండా సబ్సిడీలన్నీ ఆపేశారు. సంపూర్ణ మద్య నిషేధం హామీ ఇచ్చారు.. కానీ ప్రభుత్వమే విక్రయిస్తోంది. ఇష్టారీతిన అమ్ముతున్నారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. 2.30లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. మెగా డీఎస్సీ వేస్తామని చెప్పారు. నాలుగున్న రేళ్లు నిద్రపోయి కేవలం 6వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. జగన్ ది హత్యా రాజకీయాలు చేసే పాలన. సొంత బాబాయిని చంపిన నిందితులను కాపాడుతున్నారు. నిందితుడిగా ఉన్న అవినాష్కే మళ్లీ టికెట్ ఇచ్చారు. అతడు చట్టసభల్లోకి వెళ్లకూడదు. అన్యాయాన్ని ఎదిరించేందుకే ఎంపీగా పోటీచేస్తున్నా. న్యాయంకోసం పోరాటం ఓ వైపు.. హంతకులు మరో వైపు.. ప్రజలు ఎవరిని గెలిపిస్తారో ఆలోచించాలి. హంతకులకు ఓటు వేయొద్దు. YSR బిడ్డను గెలిపించాలని కోరుతున్నా. ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటా’’ అని షర్మిల అన్నారు.