Election Updates: వాలంటీర్ల వాట్సప్ గ్రూపులా.. ప్రచార వేదికలా..

Election Updates: Like a WhatsApp group of volunteers.. Like a campaign platform..
Election Updates: Like a WhatsApp group of volunteers.. Like a campaign platform..

ఎన్నికల్లో అనుచిత లబ్ధి పొందేందుకు వైకాపా నేతలు చేయని అక్రమాలు లేవు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అన్ని రకాలుగా అడ్డదారులు తొక్కుతున్నారు. వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్తలు గ్రామాల్లో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, స్థానికులతో వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేయించి వైకాపాకు మద్దతుగా వీడియోలు పెడుతున్నారు. అధికార పార్టీకి ఎన్నికల్లో మేలు చేసేలా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ బాపట్ల జిల్లాలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఆ వాట్సప్ గ్రూపులకు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు అడ్మిన్లుగా ఉంటున్నారు. ఆ గ్రూపుల డీపీగా సీఎం జగన్ చిత్రం పెట్టడమే కాక, వాటి వేదికగా వైకాపాకు అనుకూలంగానూ.. తెదేపా, జనసేన, భాజపాకు వ్యతిరేకంగా వీడియోలు పెడుతున్నారు. వైకాపాకు మద్దతుగా తమకు వచ్చిన పోస్టులను కొందరు వాలంటీర్లు తమ పరిధిలోని 50 కుటుంబాల ఫోన్లకు పంపుతున్నారు. దీనిని అడ్డుకోకుండా అధికార యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. సామాజిక మాధ్యమాలు, వాలంటీర్లపై తగిన పర్యవేక్షణ లేదు. అధికారుల నిఘా కొరవడటంతో వారంతా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, స్థానికులతో ‘మన సచివాలయం’ పేరుతో వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేశారు.

ఆయా గ్రూపుల్లో వైకాపా ప్రభుత్వ పథకాల ఘనతను ఊదరగొడుతూ రూపొందించిన వీడియోను పోస్టు చేస్తున్నారు. ఈ నెల 27 నుంచి సీఎం జగన్ తొలి విడత బస్సు యాత్ర చేపడుతున్నారు. మీరంతా సిద్ధమా అంటూ మరో వీడియోను గ్రూపుల్లో పెట్టారు. తెదేపాకు మహిళలు ఓటు వేయరని, వైకాపాకే వేస్తామంటున్నారని వారే స్టార్ క్యాంపెయినర్లంటూ మరో వీడియోను పోస్టు చేశారు. ఐప్యాక్ మార్గదర్శకత్వంలో ఈ రాజకీయ ప్రచారం సాగుతుందనే ఆరోపణలున్నాయి. కర్లపాలెంలో తన పరిధిలోని కుటుంబాలకు వీడియోలు పంపి డిజిటల్ ప్రచారం చేస్తూ వాలంటీర్ భారతి దొరికిపోయారు. ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. దమ్మన్న వారిపాలెంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి సామాజిక మాధ్యమ కార్యకర్త వైకాపా మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తూ వీడియోలు పెట్టిన విషయాన్ని కర్లపాలెం ఎంపీడీవో నేతాజీ దృష్టికి తీసుకెళ్లగా సమాచారాన్ని ఉన్న తాధికారులకు తెలియజేసి వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటానని తెలిపారు.