2019 ఎన్నికల్లో ప్రజలు తిక్కలోడికి ఓటేస్తే ఏపీకి రాజధాని లేకుండా చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా తాడికొండలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వెయ్యి మంది జగన్‌లు వచ్చి నా అమరావతిని అంగుళం కూడా కదల్చలేరన్నారు. అమరావతి రైతులు, మహిళల పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు.
‘‘అమరావతి కోసం 29వేల మంది రైతులు 35వేల ఎకరాలు ఇచ్చారు. రాజధానికి కేంద్రం కూడా సహకరించింది. అమరావతిని కూడా హైదరాబాద్‌లా మారుద్దామని ప్రణాళికలు వేశాం. విజయవాడ, గుంటూరుతో కలిపి ఆదర్శ రాజధాని చేయాలనుకున్నాం. ప్రపంచదేశాలన్నీ అమరావతి వైపు చూడాలని ఆలోచించా. సంపద సృష్టించే కేంద్రంగా తయారుచేయాలనుకున్నా. జగన్ వచ్చాక రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చేశారు. ఉపాధి కోసం యువత పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. రాజధాని అంటే పెద్ద పెద్ద భవనాలు కాదు, ఆంధ్రుల ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం. అమరావతితో మూడు ముక్కలాట ఆడుతూ తమాషాలు చేస్తున్నారు. అమరావతిని ఎవరూ కూడా ఇక్కడి నుంచి కదల్చలేరు. అసాధ్యాన్ని.. సుసాధ్యం చేయడమే తెలుగుదేశం పార్టీ సత్తా. మన రాజధాని అమరావతే. విశాఖపట్నం, కర్నూలును అభివృద్ధి చేస్తాం. గోదావరి జిల్లాలు గర్జిస్తున్నాయి. ఆ జిల్లాల్లో వైకాపాకు ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు అమరావతి ప్రజల సంబరాలతో పాటు.. జగనాసుర వధ కూడా జరుగుతుంది. జగన్ పోవాలి.. ప్రజలు గెలవాలి.