జనసేన అధినేత పవన్ కల్యాణ్ మార్చి 30 నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు. పిఠాపురం నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. పిఠాపురంలో ప్రచారం చేస్తూ అక్కడినుంచే రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకూ ప్రచారానికి వెళ్లి వస్తుంటానని పార్టీ నాయకులకు చెప్పారు. ఈ ప్రకారమే షెడ్యూల్ సిద్ధం చేయాలన్నారు. మూడు విడతలుగా ఆయన రాష్ట్రవ్యాప్త ప్రచారం చేయాలని నిర్ణయించారు. పిఠాపురం వెళ్లిన తొలి రోజే శక్తిపీఠం పురూహుతిక అమ్మవారి దర్శనం చేసుకుంటారు.
అక్కడ వారాహి వాహనానికి పూజలు చేయిస్తారు. అనంతరం దత్తపీఠాన్ని దర్శిస్తారు. మార్చి 30 నుంచి మూడు రోజులపాటు పిఠాపురంలోనే ఉంటారు. పార్టీ నాయకులతో సమావేశాలతోపాటు క్రియాశీల కార్యకర్తలతో మండలాలవారీ సమావేశమవుతారు. కూటమి నాయకులైన తెదేపా, భాజపా స్థానిక నాయకులతోనూ సమావేశమవుతారు. పిఠాపురం నియోజకవర్గంలోని బంగారుపాప దర్గా దర్శనం, క్రైస్తవ పెద్దలతో సమావేశాలు ఉంటాయి. సర్వమత ప్రార్థనల్లో పాల్గొంటారు. పిఠాపురంలోనే ఉగాది వేడుకల్లో పాల్గొంటారు.