ప్రధాని రాకకు ముందుగానే సభా ప్రాంగణానికి చేరుకున్న ఎన్ఎస్జీ, ఎస్పీజీ బృందాలు సైతం సభ నిర్వహణలో బందోబస్తుపరమైన లోపాలు ఉన్నాయని గుర్తించి అప్రమత్తం చేశాయి. అప్పుడూ పోలీసులు స్పందించలేదు. ప్రధాన వేదిక మీదకు ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్‌కల్యాణ్ చేరుకున్నాక కూడా ముందుభాగాన సరైన భద్రతా చర్యలు చేపట్టలేదు. సభా ప్రాంగణంలో మైకు, లైట్ల కోసం ఏర్పాటుచేసిన టవర్లపైకి కొందరు కార్యకర్తలు ఎక్కడంతో.. వారిని కిందకు దించాలని పోలీసులకు ప్రధానే సూచించారు. అయినా వారు స్పందించలేదు.
VVIP, VIP గ్యాలరీల్లోకి పాస్‌లు ఉన్న వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపాలి. పోలీసులు పట్టించుకోకపోవటంతో ఎవరు పడితే వారు గ్యాలరీల్లోకి చొరబడ్డారు. VVIP, VIP, ప్రెస్ గ్యాలరీల్లోకి సాధారణ కార్యకర్తలు వచ్చి హల్చల్ చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. ప్రెస్ గ్యాలరీల్లోకి కార్యకర్తలు చొచ్చు కొచ్చారు. మీడియా ప్రతినిధులు వారిని బయటకు పంపాలని అక్కడ ఉన్న పోలీసులకు చెప్పినా స్పందించలేదు. ప్రధాన వేదిక వద్ద పల్నాడు, బాపట్ల ఎస్పీలతో పాటు పలువురు ఉన్న తాధికారులు ఉన్నారు. వీరి తీరు నేతలకు అసహనం కలిగించింది.