ఓటు వేసే ముందు పార్టీల చరిత్ర, అభ్యర్థుల గుణగణాలు పరిశీలించాలని సూచించారు. ప్రజల చేతుల్లో ఉండే ఏకైక వజ్రాయుధం ఓటు అని తెలిపారు. ఓటు ప్రజల తలరాతను మారుస్తుందని చెప్పారు. ఓటును సక్రమంగా ఉపయోగించుకుంటే ఐదేళ్ల భవిష్యత్ బాగుంటుందని చెప్పారు. వికారాబాద్ జిల్లాలో తాండూరులో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు.
“బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ సాధన కోసం. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్. 55 ఏళ్లు తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ఇబ్బంది పెట్టింది. మిషన్‌భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేస్తున్నాం. కాంగ్రెస్ హయాంలో తాగు, సాగునీరు, విద్యుత్ కష్టాలు ఉండేవి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికి వలసలు ఎక్కువ ఉండేవి.. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.2వేలకు పెంచాం. నీటి పన్నును రద్దు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. రైతు బంధు పథకాన్ని పుట్టించిందే కేసీఆర్.” అని తాండూరు సభా వేదికగా సీఎం కేసీఆర్ అన్నారు.