పాలకులు తన కుటుంబం కంటే ప్రజల ఆనందమే ముఖ్యమని భావించాలని రామ కథ చెబుతోందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా X (ట్విటర్) వేదికగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. త్రేతాయుగం నాటి రామరాజ్యం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నామంటే, ప్రజల మనోభావాలకు అనుగుణంగా సాగిన శ్రీరాముడి పాలనే కారణమన్నారు. అలాంటి పాలనలోనే ఊరు పచ్చగా ఉంటుందని.. సమాజంలో శాంతి వెల్లివిరుస్తుందని తెలిపారు. మరి కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుభిక్షమైన, సుఖశాంతులతో కూడిన రామరాజ్యం లాంటి పాలన రావాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.
సీతారాముల దయ అందరి కుటుంబాలపై ఉండాలి: లోకేశ్
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ X (ట్విటర్) వేదికగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ధర్మపాలనకు పెట్టింది పేరైన శ్రీరామచంద్రమూర్తి కరుణా కటాక్షాలు ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. సీతారాముల దయ అందరి కుటుంబాలపై ప్రసరించి సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.