రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డితో పాటు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కార్యాలయంలో సోదాలు చేపట్టారు. నియోజకవర్గంలో రేవంత్ తరపున కొండల్ రెడ్డి ప్రచార బాధ్యతలు చూస్తుండగా… మంగళవారం ఎన్నికల ప్రచార సమయం పూర్తయ్యాక స్థానికేతరులు ఎవరు స్థానికంగా ఉండకూడదటూ పోలీసులు ఆయనను ఆదేశించారు.
ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు ప్రచారం ముగిశాక తిరిగి వెళ్లిపోవాలని ఎన్నికల నిబంధనల ప్రకారం సూచించారు. అయితే పోలీసులు అధికారిక వాహనాల్లో రాకుండా వ్యక్తిగత వాహనాల్లో ఎందుకు వచ్చారని కొండల్ రెడ్డి ప్రశ్నించారు. తన ఇంటిచుట్టూ సుమారు గంటకు పైగా ప్రైవేట్ వాహనాలు అనుమానాస్పదంగా తిరుగుతున్నాయని, పోలీసులమంటూ ప్రైవేట్ వాహనాల్లో రావడం పట్ల తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు.