ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపించే కొద్దీ ఈ వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అది ఎలా ఉన్నా… ఇప్పుడు విశాఖపట్నంకు వచ్చేందుకు రేవంత్‌రెడ్డి సిద్ధమయ్యారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 11న విశాఖ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసే బహిరంగ సభలో రేవంత్ పాల్గొని ప్రసంగించనున్నారు. టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తులు ఖరారైన నేపథ్యంలో ప్రైవేటీకరణ విషయంలో రేవంత్ ఏం మాట్లాడతారనేదానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ప్రైవేటీకరణ అంశం కేంద్రం పరిధిలో ఉండటం వలన రేవంత్ రాక ప్రధాన్యతను సంతరించుకుంది.
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల, ఏఐసీసీ ఇంఛార్జ్ ఠాక్రే ఆహ్వానం మేరకు రేవంత్ ఏపీలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ పెట్టబోతున్న 3 సభల్లో ఆయన పాల్గొంటారు. తొలి సభ ఈనెల 11న విశాఖలో జరగనుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగేది కావడంతో అన్ని సంఘాలనూ కలుపుకుని సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రైవేటీకరణ చేస్తారని రాజకీయ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ విషయంపై తమ వైఖరిని బలంగా చెప్పాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
ఇటీవల తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ గురించి రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే రాష్ట్రానికి కావలసిన అభివృద్ధి నిధులను తెచ్చుకుంటామని చెప్పారు. ఈ నేపథ్యంలో విశాఖ ప్రైవేటీకరణ అంశంపై కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎండగడతారనేది ఆసక్తికరంగా మారింది. ఆదిలాబాద్ టూర్లో రేవంత్ ప్రధాని మోదీని పెద్దన్న అని పిలిచినా విశాఖ సభలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై విమర్శలు గుప్పించే అవకాశం ఉంది. ఇప్పుడు టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులు ఖరారయ్యాయి. దీంతో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో చంద్రబాబుపై రేవంత్ ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది. రాజకీయ గురువును వదిలేసి మిగతా పక్షాలపై విమర్శలు గుప్పిస్తే రేవంత్ కూడా అవకాశవాదే అనే నెపం పడుతుంది. రాజకీయాన్ని రాజకీయంగానే చూడాలి కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం మెప్పు పొందేందుకు అందరిపై విమర్శలు చేస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.