పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ పది రూపాయల పనులకు రూ.100 ఖర్చు చేసి తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. వనపర్తి జిల్లా పాన్గల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించి.. కార్యకర్తలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంగారు పళ్లెంలో రాష్ట్రాన్ని అప్పజెప్పామని ప్రగల్భాలు పలుకుతున్న భారాస నాయకులు.. పళ్లెంలో అప్పు ఎంత ఉందో రాష్ట్ర ప్రజలకు చెప్పాలన్నారు. అప్పుల రాష్ట్రమైనప్పటికీ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేసిందని గుర్తు చేశారు. హామీల్లో భాగంగా పేదలకు రూ.5,00,000 ఆర్థిక సాయం అందించాలనే కృతనిశ్చయంతో ఉందన్నారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకునేందుకు పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులను గెలిపించి బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు.