అమరావతిని ఆరు నెలల్లో అభివృద్ధి చేయడంతోపాటు రాజధానికి భూములు ఇచ్చిన రైతుల ప్లాట్లను మూడు నెలల్లో అభివృద్ధి చేసి ఇవ్వాలని హైకోర్టు మాండమస్ తీర్పు ఇచ్చి ఆదివారంతో రెండేళ్లు పూర్తయినా ప్రభుత్వం దానిని అమలు చేయడం లేదంటూ రాజధాని రైతులు ధ్వజమెత్తారు.
ఈ సందర్భంగా తుళ్లూరు శిబిరంలో రైతులు, మహిళలు గరిటెలతో పళ్లేలపై మోగిస్తూ నిరసన తెలిపారు. అమరావతిని అభివృద్ధి చేయకుండా మొద్దు నిద్ర నటిస్తున్న సీఎం ఇప్పటికైనా మేల్కోవాలంటూ నినాదాలు చేశారు. సాయంత్రం తుళ్లూరు శివారు రాజధాని భూముల్లో గొడ్డళ్లు, కొడవళ్లతో ముళ్ల చెట్లు తొలగిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఆస్తులన్నింటినీ తాకట్టు పెట్టుకొనే పరిస్థితికి సీఎం జగన్ దిగజారి పోయారని ఎద్దేవ చేశారు.