తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకురాలు కుంజా సత్యవతి కన్నుమూశారు. భద్రాచలంలోని నివాసంలో ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గ మధ్యలోనే మృతి చెందారు. కుంజా సత్యవతి మృతి పట్ల అన్ని రాజకీయ పార్టీల నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి కుంజా సత్యవతికి టికెట్ దక్కే అవకాశాలు ఉన్నట్టు సమాచారం తెలుస్తోంది. ఇంతలోనే విషాదం చోటుచేసుకుంది.
బీజేపీ నేత శ్రీమతి కుంజా సత్యవతి ఆకస్మిక మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాను. 2009-14లో అసెంబ్లీలో వారితో కలిసి పని చేశాను. గిరిజనుల అభివృద్ధి కోసం ఎప్పుడూ తపనపడే సత్యవతి గారు, ఏ చిన్న అవకాశం వచ్చినా ప్రజాసంక్షేమం విషయంలో తన వాణిని బలంగా వినిపించేవారు. ఇటీవలే సత్యవతి గారితో మాట్లాడాను. ఎన్నికల కోసం క్షేత్రస్థాయిలో జరుగుతున్న పని తీరును వారు వివరించారు. ఇంతలోనే ఇలాంటి దిగ్బ్రాంతికరమైన వార్త వినాల్సి వస్తుందనుకోలేదు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని కిషన్ రెడ్డి అన్నారు..