వైకాపా నేతల ప్రచార పైత్యంతో ప్రజాధనం వృథా అవుతూనే ఉంది. అధికారమే అండగా ప్రభుత్వ భవనాలు, ఇతర నిర్మాణాలకు ఇష్టారాజ్యంగా అధికార పార్టీ రంగులు వేసేశారు. న్యాయస్థానం ఆదేశాలనూ పట్టించుకోలేదు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో.. వైకాపా రంగుల స్థానంలో వేరే రంగులు వేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం రూ.కోట్లలో ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఒక్కో భవనానికి రూ.20 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని సచివాలయ సిబ్బందే చెబుతున్నారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఈ పరిస్థితి కనిపిస్తోంది.
తెదేపా ప్రభుత్వ హయాంలో కుప్పం నియోజకవర్గంతో పాటు చిత్తూరు జిల్లాలోని పలు మండలాల్లో ఎన్టీఆర్ ట్రస్టు తోడ్పాటుతో రూ.2కే 20 లీటర్ల శుద్ధజలాన్ని అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. వైకాపా అధికారాన్ని చేపట్టిన వెంటనే.. ఈ నీటి శుద్ధి కేంద్రాలు, పంపిణీ ట్యాంకులపై సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ సీఎం వైఎస్సార్ చిత్రాలను ఆయా పంచాయతీల నుంచి తీసుకున్న రూ. 20 లక్షలతో ఏర్పాటు చేశారు. పథకం నిర్వహణను గాలికొదిలేసిన పాలకులు కేవలం ప్రచారానికే ప్రాధాన్యం ఇచ్చారు.