కడప జిల్లా లింగాలలో పీసీసీ అధ్యక్షురాలు, కడప కాంగ్రెస్ అభ్యర్థి షర్మిల ఎన్నికల ప్రచారంలో వైకాపా నేతలు గొడవకు దిగారు. జగన్‌కు అనుకూలంగా వైకాపా జెండాలు పట్టుకొని నినాదాలు చేశారు. ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలు సైతం నినాదాలు చేయడంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు స్పందించి అల్లరి మూకలను చెదరగొట్టడంతో గొడవ సద్దుమణిగింది.
షర్మిల మాట్లాడుతూ.. ‘‘ అవినాష్‌రెడ్డికి ఓడిపోతాననే భయం పట్టుకుంది. అందుకే మా పర్యటనలు అడ్డుకుంటున్నారు. జెండాలు తొలగిస్తున్నారు. మీరు ఎంతైనా అరుచుకోండి.. మాకేం అభ్యంతరం లేదు. నేను ఒకప్పుడు జగన్‌కి చెల్లెలు కాదు.. బిడ్డను. ఆయన సీఎం అయ్యాక జగన్‌తో నాకు పరిచయం లేదు. ఫర్వాలేదు ఆయన ఇష్టం. బాబాయిని చంపిన వాళ్లను పక్కన పెట్టుకున్నాడు. మళ్లీ వాళ్లకే టికెట్ ఇచ్చారు. ఇది ఒక కుటుంబం విషయం కాదు, ప్రజా నాయకుడు వివేకా హత్య విషయం. అవినాష్ అంటే మాకు ఇదివరకు కోపం లేదు. కానీ, అతడు హంతకుడని సీబీఐ తేల్చింది. అన్ని ఆధారాలు బయటపెట్టింది. హత్య చేసిన అతన్ని జగన్ కాపాడుతున్నారు. శిక్ష పడకుండా అడ్డుపడుతున్నారు. హంతకులకు జగన్ అండగా నిలబడినందుకే కడప ఎంపీగా పోటీ చేస్తున్నా. హంతకులు మరోసారి చట్టసభల్లోకి వెళ్లొద్దనే ఈ నిర్ణయం. న్యాయం , ధర్మం ఒకవైపు.. అన్యాయం, హంతకులు ఒక వైపు. అల్లరి చేసే వాళ్లు పులివెందులకు రండి.. పూల అంగళ్ల వద్ద పంచాయితీ పెడదాం . వివేకాను ఎవరు హత్య చేశారో తేల్చుకుందాం. YSR లెక్క సేవ చేస్తా.. మీ గొంతు దిల్లీ దాకా వినిపిస్తా’’ అని షర్మిల తెలిపారు.