మరికొన్ని రోజుల్లో ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్ కు ఓటమి కాదు, భారీ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. హైదరాబాద్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజల బాగోగులు చూస్తున్నామని వాళ్ల సొమ్మునే ఖర్చు చేయడం తప్పని, ఇలా చేయడం వల్ల ముఖ్యమంత్రి జగన్ రాజకీయంగా ఎంతో నష్టపోబోతున్నాడని ఆయన అన్నారు. తెలంగాణలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మాజీ సీఎం కేసీఆర్ కు ఇదే జరిగిందని షాకింగ్స్ కామెంట్స్ చేశారు.ప్యాలెస్‌లో కూర్చుని బటన్స్ నొక్కితే ఎన్నికల్లో ఓట్ల పడవని ప్రశాంత్ కిషోర్ అన్నారు. చదువుకున్న వారు ఉద్యోగాలు కోరుకుంటారని.. ఉచితాలు కాదని అభిప్రాయపడ్డారు. అటు పీకే అభిప్రాయంపై ఫైర్ అవుతున్న వైసీపీ శ్రేణులు.. చాలా సర్వేలు వైసీపీ విజయం ఖాయమని తేల్చాయని అంటున్నారు.
ఇదిలా ఉంటే ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందిస్తూ… ‘ప్రశాంత్ కిశోర్ ఓ మాయల ఫకీర్. బిహార్లో చెల్లని రూపాయి ప్రశాంత్ అని ఎద్దేవ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో చెల్లని రూపాయి చంద్రబాబు అని, వీరిద్దరూ కలిసి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. బాబు స్క్రిప్ట్ పీకే చదువుతున్నారు’ అని మండిపడ్డారు.