‘ప్రజాగళం’ బహిరంగ సభలో సౌండ్ సెట్టింగ్‌కు ఏర్పాటుచేసిన టవర్లను ఎక్కిన యువకులంతా వాటిని దిగి కిందికి రావాలని పదేపదే విజ్ఞప్తి చేశారు ప్రధాని మోదీ. పవన్ కల్యాణ్ ప్రసంగించే సమయంలో టవర్లపై కొందరు యువకులున్న విషయాన్ని గమనించిన మోదీ, పవన్ (ప్రసంగం ఆపమని) అంటూ ముందుకొచ్చారు. ‘దయచేసి టవర్ ఎక్కొద్దు. అక్కడ విద్యుత్ తీగలున్నాయి. మీ జీవితాలు మాకు చాలా ముఖ్య మైనవి. అందరూ కిందికి దిగి రండి.. ఏదైనా ప్రమాదం జరిగితే అది మాకు చాలా బాధాకరం’ అని పేర్కొన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుని వారిని అక్కడినుంచి కిందికి దించాలని పోలీసులకు సూచించారు. అనంతరం పవన్ కల్యాణ్ కూడా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని, కిందికి రావాలని సూచించారు. సభ సజావుగా జరగాలని, ప్రధాని ప్రొటోకాల్‌ను బ్రేక్ చేసి మీ కోసం ముందుకొచ్చి మాట్లాడారని ప్రశంసించారు. టవర్లపై ఎవరూ ఉండొద్దని కోరారు.
క్రమశిక్షణ అంటే ఇది.. మోదీ నాయకత్వమే ఇలాంటిది
‘నరేంద్రమోదీ నుంచి క్రమశిక్షణ నేర్చుకోవాలి. టవర్లు ఎక్కి న వారిని ఆయన గమనించి.. ప్రమాదం జరుగుతుందని ఊహించారు. అవునా.. కాదా? అలాంటి నాయకత్వం ఇక్కడికి వచ్చింది’ అని చంద్రబాబు తన ప్రసంగం మధ్యలో పేర్కొన్నారు. ఇళ్లలో ఉన్న వారికి కూడా వినిపించేలా గట్టిగా చప్పట్లు కొట్టాలని సూచించారు.