తెలంగాణ కాంగ్రెస్ నారాయణఖేడ్ అభ్యర్ధిని మార్పు చేసింది. సురేశ్ షెట్కర్‌కు ఇచ్చిన టికెట్‌ను సంజీవ్ రెడ్డికి చివరి నిమిషంలో కేటాయించారు. సంజీవ్ రెడ్డికి మొదటి నుంచి టికెట్ వస్తుందని ప్రచారం జరిగినా అభ్యర్ధుల ప్రకటన జాబితాలో మాత్రం సురేశ్ షెట్కర్‌కు వచ్చింది. దీంతో సంజీవ్ రెడ్డి వర్గం సహాయ నిరాకరణకు దిగింది. ఏఐసీసీ స్థాయి నాయకులు దీంతో ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
గురువారం రోజున కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ వచ్చిన ఆ ఇద్దరిని పిలిపించి మాట్లాడారు. కాంగ్రెస్ అక్కడ ఎవరు నిలబడినా గెలవాలన్నదే పార్టీ ధ్యేయమని స్పష్టం చేశారు. దీంతో ఆ ఇద్దరు కూర్చొని మట్లాడుకుని రాజీకి వచ్చిన తరువాత ఏఐసీసీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్లమెంటు నుంచి పోటీ చేసేందుకు సురేశ్ షెట్కర్ అంగీకరించగా…. సంజీవ్ రెడ్డికి టికెట్ ఇచ్చేట్లు రాజీ కుదిరింది. దీంతో చివరి క్షణంలో…బీ ఫామ్‌ను ప్రత్యేక ప్రతినిధి ద్వారా నారాయణ ఖేడ్‌కు పీసీసీ పంపించింది.