Election Updates: మోదీ పర్యటన ఎఫెక్ట్..ఇవాళ, రేపు హైదరాబాద్​లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Election Updates: Effect of Modi's visit..Traffic restrictions in Hyderabad today and tomorrow
Election Updates: Effect of Modi's visit..Traffic restrictions in Hyderabad today and tomorrow

తెలంగాణ శాసనసభ సమరం కీలక దశకు చేరుకున్న వేళ రాష్ట్రానికి జాతీయ నేతలు క్యూ కడుతున్నారు. తమ అభ్యర్థుల తరఫున ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. బీజేపీ నుంచి ప్రధాని మోదీ సహా, నడ్డా, అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు రాష్ట్రానికి వచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 3 సార్లు రాష్ట్రంలో పర్యటించిన మోదీ ఇవాళ మరోసారి రానున్నారు. మూడ్రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన దృష్ట్యా హైదరాబాద్​లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఈనెల 25, 26 తేదీల్లో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అదనపు పోలీసు కమిషనర్‌(ట్రాఫిక్‌) జి.సుధీర్‌బాబు తెలిపారు. ఈరోజు సాయంత్రం 5:20కు బేగంపేట విమానాశ్రయానికి వచ్చే ప్రధాని ఇక్కడి పీఎన్‌టీ ఫ్లైఓవర్‌, వై.జంక్షన్‌, బేగంపేట ఫ్లైఓవర్‌ మీదుగా రాజ్‌భవన్‌ చేరుకోనున్నారు. 26వ తేదీన ఉదయం 10:35 నుంచి 11:05 మధ్య ప్రధాని రాజ్‌భవన్‌ నుంచి ఎంఎంటీఎస్‌, యశోద ఆసుపత్రి, బేగంపేట ఫ్లైఓవర్‌ మీదుగా బేగంపేట విమానాశ్రయానికి వెళతారు. ఆ వేళల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు, నిలిపివేత ఉంటాయని సుధీర్ బాబు వెల్లడించారు.