ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇజ్రాయెల్‌లో పర్యటించారు. సోమవారం రోజున ఇజ్రాయెల్ గడ్డపై అడుగుపెట్టిన ఆయన, ఆ దేశ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహును కలిశారు. ఈ ఇరువురు కలిసి హమాస్ దాడి చేసిన కిబ్బుజ్లో పర్యటించారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య అక్కడికి చేరుకున్న ఎలాన్ మస్క్ .. తన ఫోన్లో అక్కడి భయానక దృశ్యాల ఫొటోలు, వీడియోలను రికార్డు చేసుకున్నారు. ఇజ్రాయెల్ కమ్యూనికేషన్ల మంత్రి ష్లోమో కర్హి మస్క్ కంపెనీ స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్తో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు.
అయితే మస్క్‌ను ఆహ్వానించారా, తనంత తానుగా వచ్చారా అన్న అంశంపై స్పందించేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఐలన్ లెవీ నిరాకరించారు. మరోవైపు ఇటీవలే సామాజిక మాధ్యమంలో యూదు వ్యతిరేక పోస్టులకు ఎలాన్ మస్క్ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. దానిపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మండిపడ్డారు. యూదు వ్యతిరేకత ఏ రూపంలో ఉన్నా తప్పేనంటూ వ్యాఖ్యానించారు.