ఆధార్ ఆధారంగా వ్యక్తిగత డేటా బహిర్గతమయ్యే అవకాశమే లేదని ఇంతకాలం ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఎన్ని ఆరోపణలు వస్తున్నా ఆధార్ అత్యంత భద్రం అని సమాధానం ఇస్తూ వస్తోంది. దీనిని నిరూపించడానికా అన్నట్లు ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ తన ఆధార్ నంబర్ ను సామాజిక మధ్యమంలో పోస్ట్ చేసి ఎవరైనా సరే తన వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేయండంటూ ఒక సవాల్ విసిరారు. అయితే ఆ సవాల్ కు వచ్చిన స్పందన, తన వ్యక్తిగత వివరాలు బహిర్గతం కావడంతో ఆయనకు దిమ్మతిరిగింది. దమ్ముంటే నా వివరాలు వెల్లడించండని సవాలు విసిరిన ట్రాయ్ ఛైర్మన్ పై ఎథికల్ హాకర్స్ ముమ్మరం చేశారు. ఏక్షణాన సవాలు విసిరారో గాని… ఈ వ్యవహారం ఇపుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. తన ఆధార్ నంబర్ వెల్లడించి…ఆర్ ఎస్ శర్మకు చెందిన ఫోన్ నంబర్, ఈ మెయిల్ ఐడీ, ఆయన అడ్రస్, పుట్టిన తేదీ, పాన్ నంబర్, ఓటర్ ఐడీ నంబర్, టెలికాం ఆపరేటర్, ఫోన్ మోడల్, ఎయిర్ ఇండియాలో ఆయన ప్రయాణ వివరాలు వంటివి బయట పెట్టారు.
ఇవన్నీ నెట్‌లో అందుబాటులో ఉన్నవే కదా అంటూ కొందరు మళ్ళీ హాకర్స్‌ను సవాలు చేశారు. దీనికి సమాధానంగా ఏకంగా ఆర్ ఎస్ శర్మకు చెందిన బ్యాంకు ఖాతాలోకి రూపాయి డిపాజిట్ చేసి అలా డిపాజిట్ చేసిన వివరాలు కూడా నెట్ పెట్టడంతో వ్యవహారం బాగా ముదిరింది. ఆధార్‌తో లింక్ అయిన పే టీఎం, భీమ్ వంటి యాప్స్‌తో పాటు ఐఎంపీఎస్ ద్వారా ఒక రూపాయి పంపించిన.. ఆ వివరాలు స్క్రీన్ షాట్స్‌ను కూడా పెట్టారు. ఎలియట్ అండర్సన్‌తో పాటు పుష్పేంద్ర సింగ్, కనిష్క్ సజనాని, అనివర్ ఆరవింద్, కరణ్ సైనీ వంటి హ్యాకర్స్ శర్మకు సంబంధించిన ఏకంగా 14 అంశాలకు సంబంధించిన వివరాలను బయటపెట్టారు. ఇంకా శర్మకు చెందిన డీమ్యాట్ అకౌంట్ ఖాతాలతో పాటు ఓ మత సంస్థకు ఎస్‌బీఐ కార్డు ద్వారా ఆయన మూడేళ్ళ సబ్‌స్ర్కిప్షన్ చెల్లించిన వివరాలు కూడా సంపాదించారు. ఇవన్నీ తాము ఆధార్‌లో ఉన్న లోపాలను బయటపెట్టేందుకు చేసినవేనని, వీటి వెనుక ఎలాంటి నేరపూరిత కుట్ర లేదని హాకర్స్ మరోమారు స్పష్టం చేశారు. దీంతో కంగుతిన్న ట్రాయ్ ఆ వివరాలు ఎలా బయటకు వచ్చాయన్న విషయంపై విచారణ జరుపుతామని ట్రాయ్ పేర్కొంది.