ఐపీఎల్ 13వ సీజన్లో మంగళవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ హ్యాట్రిక్ విజయం నమోదు చేయడంలో నికోలస్ పూరన్ పాత్ర కీలకమని చెప్పొచ్చు. ఈ సీజన్లో పూరన్ కింగ్స్ పంజాబ్ తరపున ఆది నుంచి మంచి ప్రదర్శననే కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు కింగ్స్ తరపున 10 మ్యాచ్‌లాడిన పూరన్ 183. 22 స్ట్రైక్ రేట్‌తో 295 రన్స్ చేశాడు. ఇందులో రెండు అర్థసెంచరీలు ఉన్నాయి. కాగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో నికోలస్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌పై పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిసిస్తున్నారు. అందులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నాడు.
‘ఢిల్లీతో మ్యాచ్‌లో నికోలస్ పూరన్ ఇన్నింగ్స్ అద్బుతం. అతను ఆడిన కొన్ని పవర్ షాట్స్ నాకు దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జేపీ డుమినిని గుర్తుచేశాయి. పూరన్ కొట్టిన ప్రతీ షాట్ క్లీన్‌గా ఉంటూనే మంచి పవర్ కలిగి ఉన్నాయి. అతని ఆటతీరు కొన్నిసార్లు డుమిని తలచుకునేలా చేసింది.’ అని పేర్కొన్నాడు. కాగా దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించిన జేపీ డుమిని 46 టెస్టులు, 199 వన్డేలు, 81 టీ20లు ఆడాడు. ఐపీఎల్‌లోనూ ముంబై ఇండియన్స్, డెక్కన్ చార్జర్స్, సన్‌రైజర్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడాడు.
కాగా డుమిని జూలై 2019లో అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్ని రకాల ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాడు. కాగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో నికోలస్ పూరన్ 28 బంతుల్లోనే 53 పరుగులు చేశాడు. పూరన్ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. ప్రస్తుతం లీగ్‌లో 5వ స్థానంలో ఉన్న పంజాబ్ తన తదుపరి మ్యాచ్‌లో అక్టోబర్ 24న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఎదుర్కోనుంది.