ఎప్పుడు భారీ బందోబస్తు మధ్య ఉండే శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమర్ కేర్ సర్వీసెస్ సెంటర్‌కు వచ్చిన మెయిల్ ఒకటి కలకలం రేపింది. ఎయిర్ పోర్టులో పేలుళ్లు జరుపుతామన్నది ఆ మెయిల్ సారాంశం. వెంటనే రెడ్ అలర్ట్ ప్రకటించి, ఎయిర్ పోర్టును జల్లెడ పట్టారు. మెయిల్ ఎక్కడి నుండి వచ్చిందన్న దానిపై ఐపీ అడ్రస్ ఆధారంగా విచారణ చేపట్టారు. సాయిరాం కాలేరు అనే యువకుడి పేరుతో మెయిల్ వచ్చినట్లుగా గుర్తించారు. ఐపీ అడ్రస్ ఆధారంగా మెయిల్ పంపిన యువకున్ని అదుపులోకి తీసుకుని.. రిమాండ్‌కు తరలించారు.
గీతం యూనివర్సిటీ నుండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివాడు సాయిరాం. ఇతను వాళ్ల అమ్మమ్మ ఇంటికి తరుచుగా వెళ్లేవాడు. అక్కడ శశికాంత్ అనే యువకుడు పరిచయమయ్యాడు. కెనడా వెళ్లేందుకు సాయిరాం ప్రయత్నిస్తున్నాడు. మొదటిసారి రిజెక్ట్ కావడంతో రెండవసారి అప్లై చేయడానికి శశికాంత్ ఇంటికి వచ్చి, తన వెబ్ సైట్ ద్వారా సర్టిఫికెట్లను పీడీఎఫ్ రూపంలో దరఖాస్తు చేసుకున్నాడు. ఇదంతా గమనించిన శశికాంత్ కెనడా వెబ్ ఫోరంలోకి వెళ్లి సాయిరాం పేరు మీద అసభ్య పదజాలంతో వివరాలను నమోదు చేశాడు.
దీనిపై గత నెల 20వ తేదీన రాచకొండ సైబర్ క్రైం టీమ్‌కు ఫిర్యాదు చేశాడు సాయిరాం. ఈనెల 3న సాయిరాం కెనడాకు వెళ్తున్నాడని తెలుసుకున్న శశికాంత్ ఎలాగైనా సాయిరాం కెనడాకు వెళ్లకూడదని స్కెచ్ వేశాడు. సాయిరాం వివరాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్టును పేలుస్తున్నట్లు మెయిల్ పంపించాడు. ఐపీ అడ్రాస్ ఆధారంగా మెయిల్ పంపిన శశికాంత్‌ను గుర్తించి.. అరెస్ట్ చేశారు పోలీసులు. ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపులు రావడం తనిఖీలు చేయడం పోలీసులకు పరిపాటిగా మారినప్పటికి ఏ ఒక్క సమాచారాన్ని చులకనగా తీసుకోవడం లేదు. ఎవరైనా సరే ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఇచ్చినట్లైతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.