దేశవ్యాప్తంగా ఆడవాళ్లపై, పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాటం చేయాలని హీరో మంచు మనోజ్ పిలుపు నిచ్చాడు. రాజకీయ పార్టీలకు అతీతంగా మహిళల భద్రత కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలంటూ ట్వీట్ చేశాడు. కాగా ఇటీవల సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటన తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ఈ ఘటన సినీ, రాజకీయ ప్రముఖులను కదిలించింది. దీంతో ప్రతి ఒక్కరూ దీనిపై స్పందించారు.
ఇక ఈ కేసులో నిందితుడైన రాజు నిన్న ఆత్మహత్య చేసుకోవడంతో మనోజ్ స్పందిస్తూ దేవుడు ఉన్నాడు అంటూ ట్వీట్ చేశాడు.మరోసారి ఇలాంటి ఘటనలను ఉద్దేశిస్తూ మనోజ్ శుక్రవారం మరో ట్వీట్ చేశాడు. ఇందులో ‘ఇది ఒక రాష్ట్ర సమస్య కాదు. దేశ సమస్య. దేశంలో ఆడబిడ్డకు ఎక్కడ అన్యాయం జరిగిన అది జాతికే అవమానం. భవిష్యత్తులో ఇలాంటి ఘోరఘటనలు జరగకుండా అందరం ఒక్కటిగా కలిసి పోరాడదాం. రాజకీయ పార్టీలకు, అజెండాలు, రాష్ట్రాలు, భాషలకు అతీతంగా మహిళల భద్రత కోసం పాటు పడదాం.
ఇటీవల ఓ రాజకీయ పార్టీకి చెందిన ఫాలోవర్స్ నుంచి ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ రావడం చూశాను. మీకు నచ్చిన రాజకీయా పార్టీ కోసం కాకుండా మహిళలు, చిన్నారుల రక్షణ గురించి ఆలోచించండి. మన ఇంటి ఆడబిడ్డలకు మెరుగైన సమాజాన్ని సిద్దం చేద్దాం. ఒక్కరి కోసం అందరూ.. అందరి కోసం ఒక్కరూ.. కలిసి ఉంటేనే నిలబడగలం’ అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు.