Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణా ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయమనే చెప్పాలి. వ్యవసాయం ఆధారంగానే గ్రామాలు, చెరువులు, వృత్తులు, సంస్కృతులు నిర్మించబడుతూ వచ్చాయి. నదులున్నప్పటికీ వాటిని వ్యవసాయానికి అనుగుణంగా మలుచుకునే సాంకేతికాభివృద్ది జరుగకపోవడం వల్ల నిన్నమొన్నటి వరకు వర్షాధారంగా వ్యవసాయం సాగింది. నీటి పారుదలకు ఉదక యంత్రాలు, ఏతాలు ఉపయోగించేవారు. కాకతీయరాజులు తీసుకున్న ప్రత్యేక శ్రద్ద వల్ల నీటిపారుదల కోసమే చెరువుల నిర్మాణం అధికంగా జరిగింది. పెద్ద చెరువులు, గొలుసు చెరువులు, చెరువుల వ్యవస్థ ప్రత్యేకంగా కనిపించటం వల్ల ఆరోజుల్లో ఈ ప్రదేశాన్ని ‘చెరువులదేశం’గా పిలిచేవారు.
వరి, గోధుమ, నువ్వులు, పత్తి తృణధాన్యాలతో పాటు తోటల పెంపకం కూడా కొనసాగింది. ఆ క్రమంలో ‘బాగ్’ల విస్తరణ ‘బాగ్’ (తోటలు)కు నెలవైన నగరం కనుకనే హైదరబాద్‌కు ‘బాగ్‌నగర్’ అనే పేరొచ్చింది. అటు పిమ్మట భాగ్యనగర్ గా రూపాంతరం చెందింది. వ్యవసాయం కోసం అనేక వృత్తులు ఏర్పడ్డాయి. పనిముట్లు చేసేవారు. అవసరాలు చూసేవారు, పనులు చేసేవారు వివిధ వృత్తులుగా మార్పు చెందుతూ వచ్చినాయి. పురోహితులు, కంసాలి, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి, పద్మశాలి, గొల్ల, బెస్త, గౌండ్ల, గాండ్ల, చర్మకార, వడ్డెర, ఎన్నో వృత్తులు కొనసాగుతూ వచ్చినాయి.
శాతవాహనుల కాలం నాటికే నిర్మల్ కత్తులు ప్రసిద్ది పొందినాయి. పట్టు వస్త్రాలకు పోచంపల్లి, గద్వాల, ప్రపంచ ప్రసిద్ధి పొందినాయి. వ్యవసాయం, ఉత్పత్తులు, గ్రామం చుట్టూ ఎంతో జానపద సంస్కృతి పండుగలు, జాతరులు వర్థిల్లినాయి. రుంజలు, బైండ్లు, వొగ్గుకథ, శారదకథ, హరికథ, చిందు భాగోతం, బాల సంతులు, బుడిగెజంగాలు, గంగిరెద్దులు, సాధనాశూరులు, బహురూపులు, పెద్దమ్మలు, గుసాడీ నృత్యం, చెంచు, కోయ, బంజారా ప్రదర్శనలు కళకళనాడినాయి. బతుకమ్మ, బొడ్డెమ్మ, బోనాలు, వనభోజనాలు, పీరీలు, దసరా, రంజాన్, కాట్రావులు, కొత్తలు, సంక్రాంతి, ఉగాది, పెద్దలకు పండుగ, ఊరికి పండుగులు ఎన్నో కొనసాగుతున్నాయి.