జార్ఖండ్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే గురుచరణ్ నాయక్ మావోయిస్టుల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయన మంగళవారం పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలోని జినరువాన్ గ్రామంలో నిర్వహించిన ఫుట్‌బాల్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయనపై ఒక్కసారిగా మావోయిస్టులు దాడికిదిగారు. దీంతో అప్రమత్తమైన ముగ్గురు బాడీగార్డులు ఎమ్మెల్యేను రక్షించారు. అయితే ఈ దాడిలో ఒక బాడీగార్డు మృతి చెందగా.. మరో బాడీగార్డును మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన బాడీగార్డును కూడా హతమార్చినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ముగ్గురు బాడీగార్డుల నుంచి ఒక ఏకే-47, రెండు ఇన్సాస్ రైఫిళ్లను మావోయిస్టులు లాక్కేళ్లారు. ఈ ఘటనపై డీజీపీ స్పందిస్తూ.. మాజీ ఎమ్మెల్యే ఫుట్‌బాల్ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు ముందస్తు సమాచారం అందించలేదని తెలిపారు. గురుచరణ్ నాయక్ గతంలో మనోహర్‌పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా సేవలు అందించిన విషయం తెలిసిందే. ఘటనా స్థలంలో అదనపు బలగాలను మోహరించామని, జవాన్ మృతదేహాన్ని ఇంకా వెలికితీయాల్సి ఉందని డీజీపీ తెలిపారు.