ఫ్రాన్స్‌లో మరో వేరియంట్‌

ఫ్రాన్స్‌లో మరో వేరియంట్‌

ప్రపంచమంతా ఒమిక్రాన్‌ వేగానికి భయపడుతున్న తరుణంలో కరోనా మరో వేరియంట్‌ బయటపడింది. ఒమిక్రాన్‌ కన్నా అధిక మ్యుటేషన్లతో కూడిన కొత్త వేరియంట్‌ను ఫ్రాన్స్‌లో కనుగొన్నారు. ఈ నూతన వేరియంట్‌తో 12 కేసులు నమోదైనట్లు గుర్తించారు. ఇన్‌స్టిట్యూట్‌ ఐహెచ్‌యూ మెడిటరేరియన్‌ ఇన్‌ఫెక్షన్‌ అనే సంస్థకు చెందిన పరిశోధకులు దీన్ని కనుగొన్నారు. దీనికి తాత్కాలికంగా ఐహెచ్‌యూ అని పేరుపెట్టారు.

ఆఫ్రికాకు చెందిన కామెరూన్‌ నుంచి వచ్చిన వారివల్ల కొత్త వేరియంట్‌ వ్యాప్తిలోకి వచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం దీని ప్రవర్తనపై ఎలాంటి అంచనాలు లేవని, క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే దీనిపై ఒక అవగాహనకు రావాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీనిపై జరిపిన అధ్యయన వివరాలను మెడ్‌ఆర్‌ఎక్స్‌ఐవీలో ప్రచురించారు. ఈ వేరియంట్‌లో 46 మ్యుటేషన్లు జరిగాయని వీటిలో 37 డిలీషన్లు ఉన్నాయని అధ్యయనం వెల్లడించింది.

ఈ వేరియంట్‌లో కొత్తగా 30 అమీనో ఆమ్లాల మార్పులు జరగగా, 12 అమీనో ఆమ్లాల డిలీషన్‌ జరిగిందని తెలిపింది. అమీనో ఆమ్లాల మార్పుల్లో 14, డిలీషన్లలో తొమ్మిది స్పైక్‌ ప్రొటీన్‌లో జరగడం గమనార్హం. మానవ కణాల్లోకి కరోనా చొచ్చుకుపోవడంలో ఈ స్పైక్‌ ప్రొటీన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలో జరిగే మ్యుటేషన్లుతో వేరియంట్‌ వేగంగా వ్యాపించే వీలు కలుగుతుంది. కరోనా టీకాలు ఈ స్పైక్‌ ప్రొటీన్‌పై పనిచేయడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకుంటాయి.