ఇంజినీర్ మీద ప్రతాపం…మాజీ ముఖ్యమంత్రి కొడుకు అరెస్ట్

Ex Chief minister son arrested

నిన్న ముంబై-గోవా జాతీయ రహదారిపై కంకావలి ప్రాంతంలో జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు వెళ్లిన మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే నితేశ్ రాణే పనులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్వీస్ రోడ్డు వేయకపోవడంపై అక్కడే ఉన్న ప్రభుత్వ ఇంజినీర్ ప్రకాశ్ షేడేకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బురద మార్గంలో ప్రజలు నడిచి ఎలా వెళ్తారని మండిపడ్డారు. అక్కడితో ఆగక ఆయనపై దాడి చేశారు. ఎమ్మెల్యే స్వయంగా దాడి చేయడంతో ఎమ్మెల్యే అనుచరులు రెచ్చిపోయి బకెట్లతో బురద తెచ్చి ఆయనపై కుమ్మరించారు. అనంతరం అతడిని ఆ బ్రిడ్జి రైలింగ్‌కు కట్టివేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ప్రభుత్వ అధికారిపై దాడికి సంబంధించి కంకావలి పోలీసులు పలు సెక్షన్ల కింద ఎమ్మెల్యే రాణే, ఆయన అనుచరులపై కేసులు నమోదు చేశారు. నిన్న ఉదయం ఈ ఘటన జరగ్గా సాయంత్రం ఎమ్మెల్యే, ఆయన అనుచరులు 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేనే కాక మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ రాణే కుమారుడు కూడా. ఈ కేసులో ఆయన అనుచరులు మరో 16 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు.