పంజాబ్ ముఖ్యమంత్రి పదవి నుంచి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను తొలగించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన సొంతంగా పార్టీని పెడతానని ప్రకటించారు. అంతేకాదు, బీజేపీతో పొత్తుకు కూడా సంకేతాలు పంపారు. ఈ నేపథ్యంలో అమరీందర్‌పై పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ హరీశ్ రావత్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అమరీందర్ తనలోని సెక్యులరిస్టును చంపేసుకున్నారంటూ హరీశ్ రావత్ చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం స్పందించారు. లౌకికవాదం గురించి కాంగ్రెస్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
మహారాష్ట్రలో శివసేన పార్టీతో పొత్తుపెట్టుకోలేదా? అని అమరీందర్ గుర్తుచేశారు. అంతేకాదు, ఆర్ఎస్ఎస్, బీజేపీకి చెందిన నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకోలేదా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ 14 ఏళ్లు బీజేపీలో ఉన్న విషయం మర్చిపోవద్దని చురకలంటించారు. టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర పీసీసీ చీఫ్ నానా పటోల్ ఆరెస్సెస్ నుంచి కాకపోతే ఎక్కడ నుంచి వచ్చారని అమరీందర్ నిలదీశారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరెస్సెస్ నేపథ్యం నుంచే వచ్చారని మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ వ్యాఖ్యానించారు. పంజాబ్ సీఎంగా ఉన్న సమయంలో పార్టీ జోక్యం ఎక్కువైందని అమరీందర్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ తనను విశ్వసించకుండా తన ప్రయోజనాలను దెబ్బతీసిందని, అధిష్ఠానానికి విధేయుడైన నవజ్యోత్ సింగ్ సిద్ధూ వంటి అస్థిరమైన వ్యక్తికి పగ్గాలు అప్పగించి అవమానించిందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.