కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ సైకిలెక్కడం ఖాయమయ్యింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబును కలిసిన ఆయన తాజా రాజకీయాలపై చర్చించారు. టీడీపీ అధినేతతో భేటీ తర్వాత మాట్లాడిన చంద్రదేవ్ త్వరలోనే టీడీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశానని పార్టీలో ఎప్పుడు చేరేది త్వరలో ప్రకటిస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు టీడీపీ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనమయ్యిందని ప్రధాని మోదీని ఓడించడానికి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మోదీపై చంద్రబాబు పోరాటం చేస్తున్నారని అందుకే టీడీపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెప్పుకొచ్చారు. తాను టీడీపీలో చేరేందుకు చంద్రబాబు అంగీకారం తెలిపారని తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే అంశం చంద్రబాబుతో భేటీలో చర్చకు రాలేదని ఆయన పేర్కొన్నారు.
రాజా వంశీయుడైన కిషోర్ చంద్రదేవ్ ది కాంగ్రెస్ తో సుధీర్ఘకాలం అనుబంధం. ఐదు సార్లు లోక్‌సభకు, ఒకసారి రాజ్యసభకు ఎన్నికయ్యారాయన. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు ఎదురుగాలి వీచినా కిశోర్ చంద్ర సూర్యనారాయణ దేవ్ పార్వతీపురం నియోజకవర్గం నుంచి తొలిసారి ఎంపీగా విజయం సాధించారు. 1979లో ఏఐసీసీ జనరల్ సెక్రెటరీగానూ పనిచేశారు. ఇక, 1980, 1984, 2004 ఎన్నికల్లోనూ లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు. 1994 నుంచి 2000 వరకు రాజ్యసభ మెంబరుగా ఉన్నారు. నియోజకవర్గా పునర్విభజన అనంతరం 2009 ఎన్నికల్లో అరకు (ఎస్టీ) స్థానం నుంచి ఐదోసారి కూడా గెలుపొందారు. ఇందిరా గాంధీ మంత్రివర్గంలో కేంద్ర ఉక్కు, గనులు శాఖా మంత్రిగా, యూపీఏ 2లో కేంద్ర గిరిజన సంక్షేమం, పంచాయితీ రాజ్ మంత్రిగా పనిచేశారు. విభజన అనంతరం వచ్చిన 2014 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థిగా అరకు నుంచి పోటీచేసినా ఓడారు. తాజాగా ఆయాన రాజీనామా చేయడంతో ఆయన రాజకీయాల నుండి తప్పుకుంటారని అనుకున్నారు కానీ అనూహ్యంగా ఆయన టీడీపీకి జై కొట్టారు.