Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పదవి నుంచి దిగిపోతూ మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ చేసిన వ్యాఖ్యలపై దేశంలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. భారతదేశంలోని అనేక మంది ముస్లింలలో అభద్రతా భావం, అసంతృప్తి నెలకొని ఉందని అన్సారీ వ్యాఖ్యానించారు. దీనిపై రాజకీయ పార్టీలే కాకుండా సోషల్ మీడియా నెటిజన్లూ తీవ్రస్థాయిలో స్పందించారు. అనేక దేశాల్లో దౌత్యవేత్తగా పనిచేసి సుదీర్ఘ అనుభవం ఉన్న అన్సారీ పదవీ విరమణ సమయంలోఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరైనది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ముస్లింలకు అభద్రత ఉంటే…ఆ వర్గానికే చెందిన అన్సారీ ఉపరాష్ట్రపతి పదవిని అలంకరించేవారా అని ప్రశ్నిస్తున్నారు. అన్సారీకా జీహాద్ అని హ్యాష్ ట్యాగ్ పెట్టి అనేకమంది ఆయన్ను విమర్శించారు. ఇక్కడ ఉపరాష్ట్రపతిగా చేసిన అనుభవంతో పాకిస్థాన్ అధ్యక్ష పదవికి పోటీపడండి అని వ్యంగాస్త్రాలు విసిరారు. అటు అన్సారీ వ్యాఖ్యకు మోడీ కూడా పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. పశ్చిమాసియా దేశాల్లో ఎక్కువకాలం రాయబారిగా పనిచేసిన మీరు ఇకనైనా ప్రశాంతంగా, స్వేచ్ఛగా జీవించండి అని దెప్పిపొడిచారు. కొత్త ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా అన్సారీ వ్యాఖ్యలను పరోక్షంగా తప్పుబట్టారు.
కొందరు వ్యక్తులు మైనార్టీలు అభద్రతా బావంలో ఉన్నారంటున్నారని, అయితే ప్రపంచంలోని అన్ని దేశాలతో పోల్చితే భారత్ లనే వారు సురక్షితంగా ఉన్నారని వెంకయ్య వ్యాఖ్యానించారు. అటు రాజకీయ నాయకులు, సామాన్యులే కాకుండా సినీ నటులూ అన్సారీ తీరుపై మండిపడుతున్నారు.బీజేపీ ఎంపీ కూడా అయిన నటుడు పరేశ్ రావల్ అన్సారీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హమీద్ అన్సారీ త్వరగా కోలుకోవాలని, ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని సెటైర్ వేశారు. మొత్తానికి ఈ ఒక్క వ్యాఖ్యతో అన్సారీ తనకున్న క్లీన్ ఇమేజ్ ను పోగొట్టుకుని.. తాను కూడా ఫక్తు రాజకీయవేత్తనే అని నిరూపించుకున్నారు.