మహమ్మారి వైరస్ భారత్ పై పంజా విసురుతోన్న సంగతి తెలిసిందే. రోజుకు సుమారు పది వేల వరకు కేసులు నమోదువుతుండడంతో కేంద్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఇక, ఏపీ, తెలంగాణలోనూ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ప్రాణాంతక వైరస్ దెబ్బకు భయపడి ఇప్పటికేే తెలంగాణ, తమిళనాడులో పదో తరగతి పరీక్షలను రద్దు చేశారు. అయితే, ఏపీలో మాత్రం ఫిజికల్ డిస్టన్స్ పాటిస్తూ….పరీక్షలను నిర్వహించాలని ఏపీ సర్కార్ భావించింది. అయితే, కేసుల తీవ్రత…కరోనా విజృంభణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా పదో తరగతి పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నామని విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.
దీంతోపాటు, ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు సురేష్ ప్రకటించారు. ఇంటర్లో ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ చేస్తున్నట్లు మంత్రి సురేష్ తెలిపారు. కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సురేష్ వెల్లడించారు. సీఎం జగన్ ఆదేశాల ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సురేష్ వెల్లడించారు. మరోవైపు, ఇప్పటికే తెలంగాణ, తమిళనాడులో విద్యార్థుల ఆరోగ్య శ్రేయస్సు దృష్ట్యా టెన్త్ పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. వీటితోపాటు సీబీఎస్ ఈ కూడా పలు పరీక్షలను రద్దు చేసింది. పరీక్షల నిర్వహణకన్నా విద్యార్థుల ప్రాణాలే ముఖ్యమని భావించిన పలు ప్రభుత్వాలు…టెన్త్, ఇంటర్ తో పాటు పలు పోటీ పరీక్షలు, ఎంట్రన్స్ ఎగ్జామ్ లను రద్దుచేశాయి.