Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వివాదాస్పద డైరక్టర్ రాం గోపాల్ వర్మ కోరి మరీ ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు. సిట్ అధికారులు, విచారణ అధికారి అకున్ సభర్వాల్ పై వ్యక్తిగత కామెంట్లు చేసి డ్రగ్స్ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఎక్సైజ్ అనుమానిస్తోంది. అందుకే అవసరమైతే ఆయనపై కేసులు పెట్టడానికి వెనుకాడమని వాళ్లు హెచ్చరిస్తున్నారు. అధికారుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తే.. ఎవరైనా శిక్షార్హులే అంటోంది ఎక్సైజ్ శాఖ.
కెల్విన్ చెప్పిన సమాచారం ఆధారంగానే సినీ సెలబ్రిటీలకు నోటీసులు వెళ్తున్నాయి. దీనికి తోడు ఆధారాలు చూపించి మరీ ప్రశ్నలు అడుగుతారు. అందుకే చాలా మందికి ఇష్టం లేకపోయినా.. నిజాలు ఆటోమేటిగ్గా బయటికొస్తున్నాయి. ఎవరేం చెబుతున్నారో తెలియక టాలీవుడ్ టెన్షన్ పడుతోంది. డ్రగ్స్ కేసు విచారణలో పలు పాత నేరాలు కూడా బయటపడే ఛాన్స్ కనిపిస్తోంది.
ఇంత పారదర్శకంగా విచారణ జరుగుతుంటే టాలీవుడ్ ను టార్గెట్ చేస్తున్నారన్న వర్మ కామెంట్లు ఎక్సైజ్ కు చిర్రెత్తించాయి. అదేమంటే సినిమా ఫ్యాషన్ అంటూ కబుర్లు చెప్పడం వాళ్ల భ్రమేనంటున్నారు ఎక్సైజ్ అధికారులు. ఎందుకంటే సినిమా సెలబ్రిటీలకే చెడు అలవాట్లు ఎక్కువగా ఉంటాయని ఏ పోలీస్ స్టేషన్ రికార్డులు చూసినా అర్థమౌతుందనేది సిట్ మాట.