రేపు కర్ణాటక కేబినెట్ విస్తరణ జరగనుంది. ఉదయం పదిన్నర గంటలకు ముహూర్తం ఫిక్సైంది. మూడు వారాల క్రితం బీజేపీ ప్రభుత్వం వచ్చాక.. తొలిసారి క్యాబినెట్ విస్తరణ జరుగుతోంది. మొదటి విడతలో 13 నుంచి 14 మందికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది.
అనుకున్న విధంగానే మంగళవారం మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని మరో 2-3 గంటల్లో అమిత్ షా నుంచి మంత్రుల తుది జాబితా తనకు అందుతుందని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప స్పష్టం చేశారు. మూడు వారాల క్రితం కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ కూటమి కూలిన తర్వాత యడియూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
అయితే అన్ని శాఖల్ని ఆయన తన వద్దే ఉంచుకున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించి మూడు వారాలు గడుస్తున్నా.. మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడం పట్ల విపక్షాలు విమర్శలు కురిపిస్తున్నాయి. రేపు 13 నుంచి 14 మంది తొలివిడతలో మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది.
మంత్రివర్గ కూర్పులో యడియూరప్పకు అనేక సవాళ్లు ఎదురవనున్నాయి. కుల, మత, ప్రాంతీయ సమీకరణాల్ని పరగణనలోకి తీసుకుంటూనే తనకు సహకరించిన అన్ని వర్గాలకు తగిన స్థానం కల్పించాలి. అలాగే చాలా మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉత్తర, మధ్య కర్ణాటకకు చెందినవారు.
దీంతో ఆయా ప్రాంతాలకు తగిన ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉంది. మరోవైపు తనకు, బీజేపీకి అండగా ఉంటూ వస్తున్న లింగాయత్ సామాజిక వర్గం నాయకులు భారీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కేబినెట్‌లో ఉపముఖ్యమంత్రులు ఎవరూ ఉండకపోవచ్చునని సమాచారం.