లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయం పై తివ్ర ఉత్కంఠ:కేసీఆర్ బాటలో పలు రాష్ట్రాల ముఖ్య మంత్రులు

ప్రపంచాన్ని వణికించేస్తున్న వైరస్ కరోనా. ఈ మహమ్మారిని అరికట్టడానికి కేంద్రం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ని పొడిగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై చర్చించడానికి ప్రధాని ప్రస్తుతం అన్ని పార్టీల పార్లమెంటరీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. కరోనా వ్యాప్తి ఇప్పుడు కీలక దశలో ఉన్న ఈ కీలక సమయంలో ఈ నెల 14న లాక్ డౌన్ ఎత్తేస్తే దేశం చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కోనుందనే దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

లాక్ డౌన్ పొడిగించకపోతే ఈ మహమ్మారి మరింత విజృంభించే ప్రమాదముందని వివిధ రాష్ట్రాల సీఎంలు కేంద్రాన్ని కోరుతున్నారు. అలాగే… ప్రధాని నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్ కి వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎంపీలు మిథున్ రెడ్డి, సత్యవతి, ఎంవీవీ సత్యనారాయణ హాజరైనట్లు సమాచారం అందుతుంది. అలాగే… టీడీపీ నుంచి గల్లా జయదేవ్, తెలంగాణలో టీఆర్ఎస్ నుంచి కేశవరావు, నామా నాగేశ్వర రావు కూడా ఈ చర్చలో పాల్గొన్నారు.

అంతేకాకుండా వైద్య నిపుణులతో పాటుగా చాలామంది ఇతర రంగాల ప్రముఖులు కూడా లాక్ డౌన్ ని పొడిగించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల పద్నాలుగు తర్వాత కూడా లాక్ డౌన్ అమలవ్వాలని ఇప్పటికే యూపీతో పాటు రాజస్థాన్ ప్రభుత్వాలు కూడా ప్రకటించాయి. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా లాగ్ డౌన్ ని పొడిగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ప్రెస్ మీట్ లో లాక్ డౌన్ పొడిగించాలని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మన దేశ ప్రధాని ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది.