ఫేస్‌బుక్ ద్వారా పరిచయమై ప్రేమగా నటించి ఖరీదైన బహుమతి పేరుతో సుమారు రూ.38 లక్షల వసూలు చేసిన సైబర్ మోసం వెలుగు చూసింది. పోలీసుల కధనం ప్రకారం.. సికింద్రాబాద్ వెస్ట్ మారేడపల్లికి చెందిన సురేఖ అనే మహిళకు ఫేస్‌బుక్‌లో యూకేకు చెందిన వ్యక్తి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. రిక్వెస్ట్ కన్ఫమ్ చేయడంతో తాను యూకేలో డాక్టర్ హెర్మన్‌గా అని పరిచయం చేసుకున్నాడు. ప్రేమగా నటిస్తూ కొద్ది రోజుల తర్వాత మొబైల్ నెంబర్ తీసుకొని వాట్సాప్ చాటింగ్ ప్రారంభించాడు.
వాట్స్‌ప్ చాటింగ్‌లో త్వరలోనే ఖరీదైన బహుమతి పంపిస్తానని మెసేజ్ పెట్టాడు. కొద్ది రోజుల తర్వాత ఖరీదైన బహుమతి పంపించానని మరో మెసేజ్ పంపించాడు. ఆ తర్వాత ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి కస్టమ్స్ అధికారి మాట్లాడుతునాంటూ ఒక ఫోన్ వచ్చింది. మీకు ఒక పార్సిల్ వచ్చింది..అందులో డాలర్స్ ఉన్నాయి.. వాటికి టాక్స్ చెల్లించాల్సి ఉందని ఫోన్‌లో పేర్కొన్నారు. దీంతో నిజమే అనుకొని నమ్మిన మహిళా సదరు వ్యక్తి చెప్పినట్టుగా ప్రాసెసింగ్ ఫీజు, ఇన్‌కమ్ టాక్స్, కస్టమ్స్ డ్యూటీ, వివిధ పేర్లతో ఏకంగా రూ. 38 లక్షల రూపాయల వరకు ఆన్ లైన్ ద్వారా చెల్లించింది. అనంతరం సదరు వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో మోసపోయిన గ్రహించి సైబర్ క్రై మ్ పోలీసులు పిర్యాదు చేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.