కర్నాటక సరిహద్దులోని కుగ్రామాల్లో ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొందరు నకిలీ వైద్యులు పుట్టుకొచ్చారు. తాము ఎంబీబీఎస్ చేసిన వైద్యులమంటూ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్న నకిలీ డాక్టర్ల లీలలు గుట్ట రట్టైంది. నకిలీ ఎంబీబీఎస్ డాక్టర్ల ఆట కట్టించిన ఘటన స్థానిక గంగవరం మండలంలో తాజాగా చోటు చేసుకుంది. నాలుగురోడ్లు గ్రామం కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉంది. ఈ ప్రాంతంలో గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వాస్పత్రి సేవలు కావాలంటే సమీపంలోని పత్తికొండ లేదా పలమనేరు ఏరియా ఆస్పత్రికి వెళ్లాల్సిందే. ఈ ప్రాంతంలోని ప్రజలు అక్షరాస్యత తక్కువగానే ఉంటుంది. ఈ విషయాన్ని గమనించిన కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా ఎల్డూర్‌కు చెందిన శివకుమార్ అనే వ్యక్తి తాను ఎంబీబీఎస్ డాక్టర్‌నంటూ గ్రామంలో ఆర్‌వీ క్లినిక్ పేరిట మూడు నెలల క్రితం హైవేకు ఆకునుని ఆస్పత్రి ఏర్పాటు చేశారు. రోగులు అక్కడికి రావడం మొదలు పెట్టారు.