వైన్ షాపు ఓపన్.. నకిలీ జీవో సూత్రధారి అరెస్ట్

తాజాగా ప్రభుత్వం వైన్ షాపులు తెరుస్తోందంటూ ఓ జీవోను సృష్టించి మోసగాళ్లు న్యూస్ ను వైరల్ చేశారు. ఎక్సైజ్ విభాగం మద్యం దుకాణాలను ప్రారంభిస్తుందని పేర్కొంటూ సోషల్ మీడియాలో నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులను (జిఓ) ప్రసారం చేసినందుకు గాను ఓ 38ఏళ్ల వ్యక్తిని నగర పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఈ నకిలీ జీఓ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో మందుబాబులు మద్యం దుకాణాల ముందు బారులు తీరారు.

అయితే అది ఫేక్ న్యూస్. అది సృష్టించిన నిందితుడు ఉప్పల్ నివాసి కె సనీష్ కుమార్ అలియాస్ సన్నీగా గుర్తించారు. తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్పి), రాష్ట్ర టాస్క్ ఫోర్స్, ఎక్సైజ్ విభాగం నుండి ఫిర్యాదు వచ్చింది. నిషేధం, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేయడం ద్వారా కొంతమంది దుండగులు నకిలీ ఆర్డర్‌ను సృష్టించారని.. దీనిని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని.. మార్చి 29న మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉంటాయని ఈ నకిలీ జీవోలో పేర్కొన్నారు. అయితే సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ ఆర్డర్‌ను ఇతరులకు ఫార్వార్డ్ చేసినందుకు మరో ఐదుగురికి నోటీసులు అందజేశారు. నిందితుడిపై ఐపిసి, ఐటి చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు. కాగా నకిలీ వార్తలను సృష్టించడం.. ప్రసారం చేయటడం లాంటివి చేసే వారికి ఇదో హెచ్చరిక అని హైదరాబాద్ కమిషనరేట్ అధికారి స్పష్టం చేశారు.