ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి అయిదుగురు చిన్నారులు మృత్యువాత పడిన విషాద ఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. బంకా జిల్లా రాజావర్ గ్రామంలో మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో చనిపోయిన పిల్లలందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. మృతుల్లో ఓ బాలుడు, నలుగురు బాలికలు ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అశోక్ పాశ్వాన్‌కు చెందిన ఇంట్లో సాయంత్రం చిన్నారులంతా ఆడుకుంటున్నారు. అదే సమయంలో అతని భార్య సునీత వంటగదిలోకి వెళ్లి స్టవ్ వెలిగించడంతో గ్యాస్ పైపులో నుంచి మంటలు చెలరేగాయి.
దీంతో ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు చూసి భయపడిన సునీత వెంటనే భర్తను పిలవడానికి బయటికి పరుగులు తీసింది. ఇంతలోనే సిలిండర్ పేలడంతో ఇంట్లోనే కూర్చున్న అయిదుగురు చిన్నారులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. గంటలోనే ఇల్లంతా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో అశోక్ పాశ్వాన్ నలుగురు పిల్లలు, సోదరుడు ప్రకాష్ కూతురు మరణించారు. ఈ ప్రమాదంలో కుటుంబానికి చెందిన మరో ఇద్దరికి కూడా గాయాలవ్వగా.. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ప్రమాదం జరిగిన సమయంలో ప్రకాష్‌కు చెందిన కుమారుడు, కుమార్తె ఇంటి బయట ఉండడంతో వారిద్దరి ప్రాణాలు దక్కాయి. అన్నదమ్ములిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఉజ్వల పథకం కింద అతని ఇంటికి గ్యాస్ స్టవ్ వచ్చింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు బాధిత కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేస్తున్నారు. సంఘటనకు గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు స్థానిక అధికారి మొయినుద్దీన్ తెలిపారు. ప్రమాదవశాత్తు జరిగిందా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.