ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వేలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. కోవిడ్-19 బాధితులకు చికిత్స చేస్తున్న వైద్యులు కూడా దీనికి బలవుతున్నారు. తాజాగా, భారత సంతతికి చెందిన ప్రముఖ వైరాలజిస్ట్ గీతా రామ్‌జీ కరోనా లక్షణాలతో దక్షిణాఫ్రికాలో మృతిచెందారు. ప్రపంచంలోని ప్రముఖ వైరాలజిస్ట్‌గా గుర్తింపు పొందిన డాక్టర్ గీతా రామ్‌జీ.. వాక్సిన్లు, హెచ్ఐవీపై పరిశోధనలు చేస్తూ దక్షిణాఫ్రికాలో స్థిరపడ్డారు. ప్రొఫెసర్ గీతా రామ్‌జీ కరోనా వైరస్ కారణంగా కన్నుమూసినట్లు అధికారులు ప్రకటించారు.
వారం కిందటే లండన్ నుంచి దక్షిణాఫ్రికాకు చేరుకున్న ఆమె అనారోగ్యానికి గురయ్యారు. దీంతో, కుటుంబసభ్యులు ఆమెను వైద్యం కోసం ఆసుపత్రిలో చేర్పించారు. కరోనా వైరస్ సంబంధిత లక్షణాలతో చికిత్స పొందుతూ గీతా రామ్‌జీ మరణించారని దక్షిణాఫ్రికా మెడికల్ రిసెర్చ్ కౌన్సిల్ ఓ ప్రకటనలో పేర్కొంది. గీతా రామ్‌జీ అకస్మిక మరణం తమను ఎంతగానో కలచివేసిందని ఎస్‌ఏఎంఆర్‌సీ అధ్యక్షుడు గ్లెండా గ్రే వ్యాఖ్యానించారు.
దక్షిణాఫ్రికా వైద్యపరిశోధన మండలి క్లినికల్ ట్రయల్స్ విభాగం ప్రిన్సిపల్ రిసెర్చర్‌గా ఉన్న గీతా రామ్‌జీ.. హెచ్ఐవీ నిర్మూలనపై విభాగం డైరెక్టర్‌గానూ కొనసాగుతున్నారు. హెచ్ఐవీపై ఆమె చేసిన పరిశోధనలు ప్రపంచ గుర్తింపు పొందగా, పలు అవార్డులను సొంత చేసుకున్నారు. ఎయిడ్స్ నిర్మూలనలో సరికొత్త పద్ధతులను ఆవిష్కరించినందుకు గానూ యూరోపియన్ డెవలప్మెంట్ క్లినికల్ ట్రయల్స్ పార్ట్నర్షిప్స్ (ఈడీసీటీపీ) 2018లో గీతాను ‘అసాధారణ మహిళా శాస్త్రవేత్త’ అవార్డుతో సత్కరించింది. ఈ పురస్కారం ఎయిడ్స్ మహమ్మారిపై పోరాటానికి ప్రపంచ అచంచలమైన సంకల్పానికి దక్కిన గుర్తింపుగా గీతా అభివర్ణించారు.
హెచ్ఐవీ కారణంగా దక్షిణాఫ్రికాలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఆమె విశేషంగా కృషి చేశారు. దక్షిణాఫ్రికాలో స్థిరపడ్డ భారత సంతతికే చెందిన ఫార్మసిస్ట్ ప్రవీణ్ రామ్‌జీని వివాహం చేసుకున్నారు. ఇప్పటికే దక్షిణాఫ్రికాలో కరోనా వైరస్‌తో ఐదుగురు చనిపోగా, భారత సంతతికి చెందిన వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. దక్షిణ ఆఫ్రికాలోనూ 1,350 కరోనా కేసులు నమోదు కావడంతో 21 రోజులపాటు లాక్డౌన్ విధించారు. గీతా రామ్‌జీ అంత్యక్రియల గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కోవిడ్-19 వేగంగా వ్యాప్తిచెందుతుండటంతో ప్రధాన పట్టణాల్లో ఇంటింటికీ వెళ్లి కరోనా పరీక్షలను నిర్వహించడానికి 10,000 వేల వైద్య బృందాలను నియమించారు.