Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మెడలో పడిన పూలదండ ఇప్పుడు కర్నాటకతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయింది. కాంగ్రెస్ ఈ విషయాన్ని సానుకూలంగా, ప్రజాభిమానంగా భావిస్తున్నప్పటికీ… భద్రతాకోణంలో చూస్తే మాత్రం ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటన భద్రతావైఫల్యాన్ని ఎత్తిచూపుతోందని కర్నాటక సెంట్రల్ రేంజ్ ఐజీ బి. దయానంద అభిప్రాయపడ్డారు. ఈ విషయం తన దృష్టికి రాగానే తుముకూరు ఎస్పీతో మాట్లాడానని, ఆ మాల విసిరిన వ్యక్తిని గుర్తించాలని ఆదేశించానని తెలిపారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టంచేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, పూలదండ విసిరిన వ్యక్తికోసం పోలీసులు గాలిస్తున్నారని వెల్లడించారు.
కర్నాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ తుముకూరులో పర్యటిస్తున్నారు. ఓపెన్ ట్యాప్ వ్యాన్ పై నిలబడి అభిమానులకు అభివాదం చేస్తూ రాహుల్ ముందుకు సాగుతుండగా… ఆయన వ్యాన్ కు సమీపంలోనిల్చుని ఉన్న ఓ గుంపు నుంచి ఒక పూలదండ ఎగురుతూ వచ్చి డైరెక్ట్ గా రాహుల్ గాంధీ మెడలో పడింది. ఈ ఘటనతో ఒక్క క్షణం షాక్ తిన్న రాహుల్ వెంటనే తేరుకున్నారు. దండ వచ్చినవైపు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
ఈ వీడియోను కాంగ్రెస్ సోషల్ మీడియా హెడ్, కర్నాటక హీరోయిన్ దివ్యస్పందన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కర్నాటకకు మంచి టాలెంట్ ఉందని క్యాప్షన్ పెట్టారు. ఆమె ఈ వీడియో పోస్ట్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రకరకాల కామెంట్లు వెలువడ్డాయి. కొందరు సరదాగా కామెంట్ చేస్తుండగా… మరికొందరు మాత్రం రాహుల్ భద్రతపై సందేహాలు వ్యక్తంచేశారను. రాహుల్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ ఎవరో విసిరిన దండ సరిగ్గా వచ్చి ఆయన మెడలో పడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా భద్రత పెంచాలని కర్నాటక పోలీసు అధికారులు నిర్ణయించారు. మొత్తానికి దివ్యస్పందన టాలెంట్ అనుకున్నది కాస్తా… భద్రతావైపల్యంగా మారిందన్నమాట.