భూసేకరణలో తన భూమిని కోల్పోయిన ఓ రైతు పరిహారం కోసం ఆందోళన చేసి, ఆపై గంటల వ్యవధిలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలుకు చెందిన రైతు రాసాల శ్రీనివాస్ కు రెండెకరాల భూమి ఉంది. కుమార్తె వివాహం చేసి కట్నం కింద ఎకరం భూమి ఇచ్చాడు. మిగిలిన ఎకరంలో 30 కుంటలు సీతారామ ప్రాజెక్ట్ కింద పోయింది. ఎకరానికి రూ.18 లక్షలుగా నిర్ణయించిన అధికారులు.. ఇతడికి రూ.13 లక్షలు చెల్లిస్తామని ప్రకటించారు.
అయితే 18 నెలలు దాటినా ఇంతవరకూ పరిహారం ఇవ్వనే లేదు. మార్కెట్ ధరకంటే తక్కువగా పరిహారం నిర్ణయించారని, వేరే చోట భూమి కొనాలంటే డబ్బులు సరిపోక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన చెందాడు. ఈ నేపథ్యంలో మార్కెట్ ధర ప్రకారం డబ్బు చెల్లించాలంటూ ఆదివారం ఉదయం 9 గంటలకు బాధిత రైతులంతా బీరోలులోని సీతారామ క్యాంప్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.
ఇందులో రాసాల శ్రీనివాస్ కూడా పాల్గొన్నాడు. ఆ తర్వాత చేనుకు వెళ్లి 11 గంటల సమయంలో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.