ప్రగతి భవన్‌ ముందు ఆత్మహత్య

ప్రగతి భవన్‌ ముందు ఆత్మహత్య

భూమి సమస్య పరిష్కారం కావడంలేదని రైతు దంపతులు సోమవారం ప్రగతిభవన్‌ ముందు ఆత్మహత్యకు యత్నించారు. స్థానికులు, బాధితుల కథనం ప్రకారం… మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లి మండలం కొల్తూర్‌ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 444/ఎలో 35 గుంటల భూమిని వెంకగళ్ల భిక్షపతి, మరో 35 గుంటల భూమిని అతని సోదరుడు చంద్రయ్య పేరున యజమాని అబాబుల్‌ రెహమాన్‌ అలియాస్‌ బాబుదొర, అతని సోదరుల నుండి 1993లో కొనుగోలు చేసి రిజిస్టర్‌ చేసుకున్నారు.

చంద్రయ్య కొనుగోలు చేసిన 35 గుంటల భూమిని కూడా ఆ తర్వాత భిక్షపతి కొనుగోలు చేసి పట్టా చేసుకున్నాడు. ఈ భూమిని రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసి పట్టాదారు పాసుబుక్కులను ఇవ్వాలని(మ్యుటేషన్‌) భిక్షపతి మండల రెవెన్యూ, ఆర్డీవో కార్యాలయంలో పలుసార్లు దరఖాస్తు చేశాడు. కాగా ఈ భూములకు సరైనపత్రాలు లేకపోవడంతోపాటు ఈ భూవివాదం సివిల్‌కోర్టులో ఉన్నదని రెవెన్యూ అధికారులు రికార్డుల్లో నమోదు చేయలేదు. అయితే, ఈ పట్టాభూమిని తాము భిక్షపతికి అమ్మలేదని, తన భూమిలోకి అతడు రాకూడదని అబాబుల్‌ రెహమాన్‌ పలుసార్లు హెచ్చరించాడు.

భిక్షపతి తమ భూమిని అన్యాక్రాంతం చేసి చుట్టూ కడీలు(స్తంభాలు) నాటాడని అబాబుల్‌ రెహమాన్, అతని సోదరులు శామీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు ఆర్డర్‌తో భూయజమానులు ఇటీవల భూమిలోని కడీలను తొలగించారు. భిక్షపతితోపాటు అతని కుటుంబసభ్యులపై కేసు పెట్టారు. దీంతో తమ భూసమస్య ఏళ్ల తరబడి పరిష్కారం కావడం లేదని, పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదని మనస్తాపం చెందిన భిక్షపతి, ఆయన భార్య బుచ్చమ్మ సోమవారం ప్రగతిభవన్‌ ముందుకు వెళ్లి ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు.

పోలీసుల వివరణ…: పట్టాభూమిని కొల్తూర్‌కు చెందిన భిక్షపతి అన్యాక్రాంతం చేసినట్లు భూయజమాని ఫిర్యాదు చేయడంతో పూర్వాపరాలను పరిశీలించామని, విచారణ జరిపి ఈ నెల 12న భిక్షపతితోపాటు ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేశామని శామీర్‌పేట పోలీసులు తెలిపారు. సివిల్‌ కోర్టు పరిధిలో కేసు నడుస్తోందని, కోర్టు ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు.