స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న తండ్రికొడుకులు

స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న తండ్రికొడుకులు

కోలీవుడ్ సూప‌ర్ స్టార్ విక్ర‌మ్.. త‌న కొడుకు ధ్రువ్‌తో క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న సంగ‌తి తెలిసిందే. ధ్రువ్ గ‌త ఏడాది అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వ‌ర్మ‌తో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. సోలో హీరోగా అత‌డి రెండో సినిమా ఇంకా ఖ‌రారే కాలేదు. ఈలోపే తండ్రితో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ చేయ‌డానికి రెడీ అయిపోయాడ‌త‌ను. యువ ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజ్ వీళ్లిద్ద‌రినీ తెర‌పై చూపించ‌బోతున్నాడు.

అత‌ను విక్ర‌మ్‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని.. ధ్రువ్ అందులో అతిథి పాత్ర చేస్తాడ‌ని కొన్ని రోజులుగా వార్త‌లొస్తున్నాయి. అయితే ఈ సినిమాలో వీరి పాత్ర‌లు  రివ‌ర్స్ అన్న‌ది తాజా స‌మాచారం. ఇది విక్ర‌మ్ సినిమా కాద‌ట‌. ధ్రువ్ మూవీ అట‌. ఇందులో అత‌నే హీరో అట‌. విక్ర‌మ్ అత‌డిని ఢీకొట్టే విల‌న్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌.

ఇంత‌కుముందు హీరోగా మంచి స్థాయిలో ఉండ‌గానే రావ‌ణ‌న్  సినిమాలో విల‌న్ పాత్ర చేశాడు విక్ర‌మ్. ఇప్పుడు అత‌ను కొడుకు సినిమాలో విల‌న్‌గా క‌నిపిస్తాడంటే ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేక ఆస‌క్తి నెల‌కొన‌డం ఖాయం. ప్ర‌స్తుతం కార్తీక్ సుబ్బ‌రాజ్.. ధ‌నుష్ హీరోగా తీసిన జ‌గ‌మే తంత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉన్నాడు.

థియేట‌ర్లు పునఃప్రారంభం కాగానే ఆ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది. ప‌రిస్థితులు మామూలు స్థాయికి రాగానే ధ్రువ్‌-విక్ర‌మ్ సినిమాను మొద‌లుపెట్ట‌నున్నాడు. విక్ర‌మ్ ప్ర‌స్తుతం కోబ్రాతో పాటు మ‌హావీర్ క‌ర్ణ, పొన్నియ‌న్ సెల్వ‌న్ లాంటి క్రేజీ ప్రాజెక్టుల్లో న‌టిస్తున్నాడు. ధ్రువ్‌-విక్ర‌మ్‌-కార్తీక్ సినిమా ప్రి లుక్ పోస్ట‌ర్‌ను బ‌ట్టి చూస్తే ఇది ప‌క్కా యాక్ష‌న్ మూవీ అని అర్థ‌మ‌వుతోంది.